29/10/2024
యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో మంత్రి లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. విజనరీ లీడర్ చంద్రబాబునాయుడు నేతృత్వంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు. ఈ సందర్భంగా యాపిల్ సంస్థ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల రంగంలో జగజ్జేతగా నిలచిన తీరును ప్రియా బాల సుబ్రహ్మణ్యం వివరించారు. భారతదేశంలో యాపిల్ కార్యకలాపాల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ మీకు ఆహ్వానం పలుకుతోంది. బలమైన మౌలిక సదుపాయాలు, స్నేహపూర్వక వ్యాపార విధానాలతో ముందుకు సాగుతున్న మా ప్రభుత్వం యాపిల్ విస్తరణకు అవసరమైన మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎపిలో నెలకొని ఉన్న 4 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో మీకు అనుకూలమైన ప్రాంతాన్ని అన్వేషించండి. మీరు కోరుకున్నచోట తయారీ యూనిట్ స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దడానికి మేం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. యాపిల్ సంస్థ నవీన ఆవిష్కరణలపై దృష్టి సారించేందుకు మీకు మా మద్దతు ఉంటుంది. ఇప్పటికే విశాఖపట్నంలో టిసిఎస్ సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, అధునాతన సాంకేతిక పర్యావరణ వ్యవస్థ మీకు ప్రయోజనకరంగా ఉంటాయి" అని మంత్రి వివరించారు. ఎపి ప్రభుత్వంతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రియా సుబ్రహ్మణ్యం చెప్పారు. మంత్రి వెంట ఏపీ ప్రతినిధి బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ ఉన్నారు.